దశాబ్దాలు గడచినా నిర్ణయాలు నిత్యనూతనమే..
” పవర్ఫుల్ పీపుల్ మేక్స్ దెయిర్ ప్లేసెస్ పవర్ఫుల్ ” అన్న ఒక సినిమా డైలాగ్ ఇరువురి విషయంలో అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. వారిలో ఒకరు అగ్రరాజ్యమైన అమెరికాకు 34 వ అధ్యక్షునిగా పనిచేసిన ఐసేన్ హోవర్ అయితే రెండవ వారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాలకులుగా వారిరువురికీ ఎన్నో పోలికలున్నాయి. దశాబ్దాలు గడచినప్పటికి వారి నిర్ణయాలు నిత్యనూతనంగా వుంటాయి. వాటిని మించిన నిర్ణయాలు వెలువడలేదు. వారిరువురూ సామాన్యులే. అమెరికాను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దటంలో ఐసేన్ హోవర్ పాత్ర మరువలేనిది. అదేవిధంగా తెలుగుజాతిని విశ్వంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారు. చేస్తూనే వున్నారు.
డ్వైట్ డి ఐసేన్ హోవర్ అమెరికాకు 34వ అధ్యక్షునిగా 1953 లో బాధ్యతలు స్వీకరించారు. 1961 వరకు ఆ పదవిలో కొనసాగారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికాకు అధ్యక్షునిగా ఎన్నికైన ఐసేన్ హోవర్, అప్పటివరకూ పనిచేసిన అధ్యక్షులు అందరికంటే ప్రత్యేకత కలిగివున్నారు. ఐసేన్ హోవర్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా చరిత్ర గతినే మార్చివేశాయి. వివిధ రాష్ట్రాల కూటమిగా వున్న అమెరికాలో వాటి మధ్య అంతర్రాష్ట్ర హై వే వ్యవస్థను ఏర్పాటు చేసి ‘ఫెడరల్ ఎయిర్ హై వే చట్టం’ తీసుకువచ్చారు. ఆ విధంగా ఏర్పాటైన జాతీరహదారులను యుద్ధ సమయాలలో విమానాలు దిగేందుకు రన్ వే లుగా పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. ఐసేన్ హోవర్ తీసుకున్న నిర్ణయంతో తీరప్రాంత వాణిజ్యం ఊపందుకొని ఆ దేశ నిరంతర ఆర్ధికాభివృద్ధిలో భాగం కావటమే గాక, యుద్ధ సమయాలలో సైనిక కార్యకలాపాలకు ప్రయోజనకరంగా మారాయి. అమెరికాలో మొత్తం 42 వేల మైళ్ళ పొడవున అంతర్రాష్ట్ర రహదారులు విస్తరించి వున్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ దీనిని మించిన రహదారి వ్యవస్థ ఇప్పటికీ రూపుదిద్దుకోకపోవటం విశేషం. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు కనబర్చిన దార్శనికత ఏడు దశాబ్దాలు గడచినప్పటికిప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచి వున్నది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిగ్గా ఇదే తరహా దార్శనికత ప్రదర్శించారు. ప్రదర్శిస్తున్నారు. క్షుద్ర రాజకీయపు తెరల మాటున చంద్రబాబుతీసుకున్న నిర్ణయాల గొప్పతనాన్ని ఇప్పటికిప్పుడు సామాన్య ప్రజానీకం గుర్తించలేకపోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు తీసుకుంటున్న, తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని దశాబ్దాల పాటు నిత్యనూతనంగా వుంటాయనటంలో సందేహం లేదు. ఐసేన్ హోవర్ నుంచి స్ఫూర్తి పొందారో, లేక యాదృశ్చికంగానో చంద్రబాబు సైతం మూడు దశాబ్దాల క్రితమే జాతీయ రహదారులపై యోచన చేశారు. దేశీయ ప్రజాస్వామిక విధానంలో జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కావటంతో చంద్రబాబు తన ఆలోచనలను అప్పటి ప్రధాని ఎబి వాజ్ పేయీ తో పంచుకున్నారు. ఆ ఆలోచనల ఫలితమే భర్తదేశానికే మణిమకుటంగా నిలిచిన ‘స్వర్ణ చతుర్భుజి’ రహదారి వ్యవస్థ. దేశంలోని నాలుగు మూలాలను అనుసంధానిస్తూ నిర్మితమైన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి దేశ వాణిజ్య రంగానికి ఆయువుపట్టుగావున్నది. మరికొన్ని దశాబ్దాలు గడచినప్పటికి దాని ప్రాధాన్యత పెరగటమే కానీ తగ్గే అవకాశం లేదని ఆర్ధిక నిపుణుల అంచనా. ఈ రహదారిపై కొన్ని చోట్ల వైమానిక దళానికి చెందిన విమానాలు సైతం దిగే విధంగా రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ యోచన చంద్రబాబు మదిలో రూపుదిద్దుకున్నప్పటికి ఆ దిశగా ప్రచారానికి ఎన్నడూ వెంపర్లాడలేదు. ఆ ఘనత అంతా అప్పటి ఎన్డీయే సారధి, ప్రధాని ఎబి వాజ్ పేయీకే దక్కింది. చంద్రబాబు దార్శనికతకు ఇదొక ప్రబల నిదర్శనం.
అదేవిధంగా చంద్రబాబు తాజాగా పి4 ( పీపుల్, పబ్లిక్, ప్రయివేట్. పార్ట్నర్ షిప్) అనే సరికొత్త భావనను ప్రజలముందుంచారు. తెలుగునేలపై పేదరిక నిర్మూలన అనేది పి 4 విధానం లక్ష్యంగా వుంది. తెలుగునేలపై పురుడుపోసుకున్న ఈ విధానం మున్ముందు దేశం మొత్తానికి మార్గదర్శనం, అనుసరణీయం అవుతుంది అనటంలో సందేహం లేదు. చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయమైన అప్పటికప్పుడు సామాన్య, సాధారణ ప్రజానీకానికి అర్ధం కాదు. అవి ఫలితం ఇవ్వటం ప్రారంభించాక వాటి విలువ అందరికీ అవగతం అవుతుంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్, దాని ఫలితాలు అందుకు ఉదాహరణ. అదేవిధంగా చంద్రబాబు ప్రతిపక్షంలో వున్నప్పుడు రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా వున్నది. సమర్ధుడైన పాలకుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా భావితరాలకు ఉపకరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అనటానికి చంద్రబాబే నిదర్శనం. ఏడుపదుల పైబడిన వయసులోనూవిరామమెరుగక చంద్రబాబు పనిచేస్తున్నారు. అందువల్లే రాజకీయేతర వర్గాలలోనూ చంద్రబాబు కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తున్నది. చంద్రబాబు ఆలోచనలకు మరింత చేయూత అందించిన పక్షంలో భవిష్యత్ లో పేదరికం లేని సమాజ నిర్మాణం సాకారం అవుతుంది.
– డాక్టర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్, గుంటూరు.
సెల్ : 7032614864.