పొరుగుదేశం బంగ్లాదేశ్ లో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో, అక్కడి మైనారిటీలపై దాడులు జరుగుతుండడం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్రంగా స్పందించింది. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మతాల వారు మైనారిటీల కిందికి వస్తారు. బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మారణకాండకు పాల్పడుతుండడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడులు తీవ్ర ఆందోళనకరమని, ఈ దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానివని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. అధికార మార్పిడి సందర్భంగా బంగ్లాదేశ్ లో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ సామాజిక వర్గాలపై జరిగిన హింసను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. మైనారిటీలను చంపడం, దోపిడీలకు పాల్పడడం, ఆస్తులు తగలబెట్టడం, మహిళలపై అఘాయిత్యాలకు తెగబడడం వంటి క్రూరమైన చర్యలను ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని హోసబలే పేర్కొన్నారు. ఇలాంటి ఘోరాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాన్ని కోరుతున్నామని స్పష్టం చేశారు.