మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం… ఇప్పటి వరకు నలుగురు మరణించారు. అయితే, మృతుల అసలు కారణాలపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. జికా సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మిగిలిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన నలుగురు రోగులు 68 నుంచి 78 ఏళ్ల వయస్కులు. 66 కేసులలో (నిన్నటి వరకు నమోదైన కేసులు) నాలుగు మరణాలు ఉన్నాయి. అయితే ఈ మరణాలు జికా వల్ల కాకపోవచ్చు. ఈ రోగులు ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. వారు వృద్ధులు” అని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరణాలకు అసలు కారణంపై పూర్తి వివరాల కోసం పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్య విభాగం నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపించింది. పుణేలో ఈ ఏడాది జూన్ 20న తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఎరంద్వానే ప్రాంతంలో 46 ఏళ్ల డాక్టర్, అతని 15 ఏళ్ల కూతురుకు పాజిటివ్ వచ్చింది.