కన్నతల్లిని చెట్టుకు కట్టేసి, సజీవ దహనం చేసిన కొడుకులు
కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకుల కర్కశత్వం
కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు
త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఖమర్‌బరిలో ఓ 62 ఏళ్ల మహిళను ఆమె కొడుకులు ఒక చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కొడుకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వివరించారు. ఒక మహిళను కాల్చివేశారనే సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం అక్కడికి వెళ్లిందని, చెట్టుకు కట్టేసి కాల్చిన మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని జిరానియా సబ్-డివిజనల్ పోలీసు అధికారి కమల్ పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నామని చెప్పారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.