24.7 C
Hyderabad
Homeతాజా వార్తలుసెప్టెంబర్ 25లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి

సెప్టెంబర్ 25లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి

28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె

వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం అవకాశం

పింఛన్లు, నగదు లభ్యతపై ముందస్తు ఏర్పాట్లు

ఏటీఎంలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక దృష్టి

ఖాతాదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దు

కొత్త స్వరం, కర్నూలు, సెప్టెంబర్ 23: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ సూచించారు. సెప్టెంబర్ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు సాధారణ బ్యాంకు శాఖల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకులు ఎస్‌ఎల్‌బీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ (BCP) అమలు చేయాలని సూచించారు. సెప్టెంబర్ నెల ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల చెల్లింపుల్లో అంతరాయం లేకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలు, పింఛన్ పంపిణీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని బ్యాంకులకు సూచించారు. ముఖ్యమైన శాఖలు, నగదు పంపిణీ కేంద్రాల్లో తగినంత నగదు అందుబాటులో ఉంచాలని, జిల్లాలోని ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ మెషీన్లలో (CRMs) ముందస్తుగా నగదు లోడింగ్, అవసరమైన సమయంలో రీప్లెనిష్‌మెంట్ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఏటీఎంలు, సీఆర్‌ఎంలలో నగదు లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట వెంటనే నగదు భర్తీ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ తదితర డిజిటల్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ ఆధారిత చెల్లింపుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సమ్మెతో పాటు వరుస సెలవుల పరిస్థితిని ఖాతాదారులకు ముందుగానే తెలియజేసి ప్రత్యామ్నాయ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కర్నూలు జిల్లా ప్రజలు సెప్టెంబర్ 25, 2026లోగా తమకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని పి. మోహన్ కోరారు. ముఖ్యంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల లావాదేవీలు, రుణ వాయిదాల చెల్లింపులు, ప్రభుత్వ లేదా ఇతర ముఖ్యమైన చెల్లింపులు అవసరమైన వారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అత్యవసర అవసరాల కోసం ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ మెషీన్లు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్, ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. కర్నూలు జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు సాధ్యమైనంత వరకు అంతరాయం కలగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు చర్యలు చేపట్టి ఖాతాదారులకు అవసరమైన సహకారం అందించాలని పి. మోహన్ కోరారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.