Friday, July 4, 2025
Homeకొత్త కలాలు (కవిత్వం)"తెలియని అన్వేషణ"

“తెలియని అన్వేషణ”

దేనికోసం వెతుకులాట?…
దేనికోసం ఈ పరితపన?..
కోపాలు తాపాలు తెచ్చుకోవడం…?
పగలు ద్వేషాలు నింపుకోవడం…?
మోసంతో అమాయకుల కొంపలు ముంచి
బతుకులను కూల్చడం!..

మనుషులు చేసే పనులేనా ఇవి?…
మనిషి పుట్టుక పుట్టి
ఇలాంటి పనులు చేస్తారా…?
అశాశ్వతమైన దానికోసం…
శాశ్వతమైన జీవితాన్ని కోల్పోతారా..?

ఆస్తులెన్నున్నా ఆశలు చావడంలేదు!..
చచ్చేదాకా డబ్బుకై పరుగులు
తీయడం మానలేదు!…
ఎప్పుడూ ఆశనిరాశల నిట్టూర్పులే!…
బలము బలగం డబ్బేనంటూ…
అంకెలగారడీలో పడి…
డబ్బు చుట్టే తిరిగేస్తున్నారు!…

నిత్యం డబ్బు నిషాలో ఉంటున్నారు…
చిరు దరహసాలు ఒలకబోస్తూ
లోలోనే లూటీ చేస్తున్నారు!…
పైన పటారం..లోన లోటారంలాంటి
వంచించే ముంచే స్వభావంతో
దొంగలే దొరల్లా దోచేస్తున్నారు!…

పట్టపగలే కత్తులతో బెదిరించి
డబ్బును దోచేస్తున్నారు!…
మట్టుపెట్టైనా కన్నీటి
సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు!…
డబ్బు వ్యామోహాంలో పడి
తనపర బేధాలనే మరిచిపోతున్నారు!.

వచ్చేటపుడు ఏం తెచ్చామని
ఇంత ఆరాటం?…
పోయేటపుడు మాత్రం
ఏం తీసుకుపోతామని ఈ పోరాటం?..
క్రమేపి మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతోంది!…
మంచితనం తరిగిపోతోంది!…
మానవత్వం కొండచరియలా
విరిగిపోతోంది!…

మన వ్యక్తిత్వం..మంచితనమే
మనల్ని నలుగురికి దగ్గరచేసి
అందరితో జతకట్టేలా చేస్తుంది!…
స్నేహం..ప్రేమ…
ఆప్యాయత..అనురాగాలే
వెలకట్టలేని సిరులని గ్రహించాలి!…
అవి అందరికీ పంచుతూ…
“ఆ నలుగురిని” సంపాదించుకోవాలి!

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments