– సిపిఐ(ఎంఎల్) లిబరేషన్
జూపాడుబంగ్లా, ఆగస్టు 11 (కొత్తస్వరం) :
జూపాడు బంగ్లా మండలంలోని 35 బొల్లవరం మత్స్య శాఖ విత్తన క్షేత్ర భూమిని ఆక్రమించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు నందికొట్కూరు వాల్మీకి నగర్లో ముఖ్య నాయకుల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మత్స్య శాఖకు చెందిన ఈ భూమి కొంతకాలంగా నిరుపయోగంగా ఉండటంతో, తంగేడంచ బంగ్ల గ్రామానికి చెందిన స్వాతి రాధమ్మ, పిచ్చిగుంట్ల ఈశ్వరయ్య, వెంకటరమణ తదితరులు భూమిని అక్రమంగా ఆక్రమించి మామిడి మొక్కలు నాటారని తెలిపారు.ఈ ఘటనపై ప్రజా సంఘాలు జూపాడు బంగ్లా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో, మత్స్య శాఖ అధికారులు భూమిని పరిశీలించడానికి వెళ్లారు. అయితే, ఆక్రమణదారులు వారితో గొడవపడి, బెదిరింపులకు పాల్పడటంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.ఆ భూమిని వెంటనే ప్రభుత్వ స్వాధీనం చేసుకుని, చేప పిల్లల ఉత్పత్తి పునరుద్ధరించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు జూపాడు బంగ్లా గ్రామ కార్యదర్శి వేల్పుల ఏసన్న, మండల కార్యదర్శి నరసింహులు, ఎస్. బి. బి. లక్ష్మీదేవి, జి. సోమప్ప, ఎస్. మా భాష తదితరులు పాల్గొన్నారు.