- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి రవికుమార్
అమరావతి, కొత్తస్వరం
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు వద్ద అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిన సందర్భాల్లో తక్షణమే స్పందించి ప్రమాదాలను నివారించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు లో విధి నిర్వహణలో లైన్మెన్ సురేష్ ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సురేష్ భార్యకు ఉద్యోగం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మూలపేటలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన పట్ల కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.