విశ్వంభరపై మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. 2026 వేసవిలో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిరు స్పష్టం చేశారు. సినిమా ఆలస్యం కావడంపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికే ఈ వీడియో చేస్తున్నానని చిరంజీవి తెలిపారు. “ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పైనే ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నత నాణ్యతతో కూడిన అవుట్‌పుట్ అందించాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ భారీ గ్రాఫిక్స్ పనుల వల్లే సినిమా ఆలస్యమవుతోంది” అని ఆయన వివరించారు. ‘విశ్వంభర’ ఒక అద్భుతమైన చందమామ కథ లాంటిదని, ఇది పిల్లలతో పాటు ప్రతి పెద్దవారిలో ఉండే చిన్నపిల్లవాడిని కూడా ఎంతగానో అలరిస్తుందని చిరు భరోసా ఇచ్చారు. పిల్లలకు వేసవి సెలవులు అంటే చాలా ఇష్టమని, అందుకే వారిని దృష్టిలో ఉంచుకుని 2026 వేసవిలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘బింబిసార’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను తన కలల ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్‌తో, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ మూవీకి బాణీలు అందిస్తున్నారు. పురాణాలు, భావోద్వేగాలు, కళ్లు చెదిరే విజువల్స్ మేళవింపుగా ఈ సినిమా రాబోతోంది.