
గుంటూరు, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ’ (టోలిక్) హిందీ సమావేశం బుధవారం గుంటూరులోని కన్నవారితోట జీఎస్టీ భవన్‌లో నిర్వహించారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్, ఐఆర్‌ఎస్ అధికారి అరుణ్ రిచర్డ్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దైనందిన కార్యకలాపాల్లో హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించడం, అధికారుల్లో హిందీపై పని పరిజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరులోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ అధికార భాషా విధానం అమలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు, పరిపాలనా వ్యవహారాలు, నోటింగ్, డ్రాఫ్టింగ్ ప్రక్రియల్లో హిందీ వినియోగాన్ని పెంచడం, అధికారిక హిందీలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ సునీల్ చౌదరి అధికార భాషా చట్టం, అధికార భాషా నియమాలు, అధికార భాషా విభాగం రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమగ్ర వివరణ ఇచ్చారు. అలాగే కార్యాలయ నిర్వహణలో హిందీ వినియోగానికి సంబంధించిన పలు ఆచరణాత్మక అంశాలను వివరించారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ దేవ్ కుమార్ రజ్వాని మాట్లాడుతూ, అధికారిక విధుల్లో హిందీ వినియోగం అనేది రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను అమలు చేయడమే కాకుండా పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ హెయర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్, అశుతోష్, అమృత్ రాజ్, శశిదాస్, ఆనందగోపాల్, చంద్రవర్మ, నీరజ్, రవి, శ్యాంప్రకాశ్, అమిత్, చక్రధర్, రాజేష్, ప్రణిత, ఫణి తదితరులు పాల్గొన్నారు.


