- శ్రీవారి గరుడ సేవకు సర్వం సిద్ధం
- పెరటాసి మాసం తొలి శనివారం కావడంతో భారీ రద్దీ
- 9.30 లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాల ఏర్పాటు
- భద్రత, రవాణా కోసం ప్రత్యేక చర్యలు
- ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుమల, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
కలియుగ వైకుంఠం తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం సాయంత్రం మలయప్పస్వామివారు తన ప్రియ వాహనమైన గరుత్మంతుడిపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా భద్రత, వసతుల ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది గరుడ సేవ శనివారం రావడంతో పాటు తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం తొలి శనివారం కావడంతో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో సుమారు 1.20 లక్షల మంది భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేసి, రద్దీని నియంత్రిస్తూ ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఊరేగింపు నిర్దిష్ట ప్రాంతాలను దాటిన తర్వాత భక్తులను రొటేషన్ పద్ధతిలో అనుమతించనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాల వితరణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది గరుడ సేవ రోజున 6.13 లక్షల అన్నప్రసాదాలు అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రసాదాలను 30 శాతం, పానీయాలను 50 శాతం అదనంగా సిద్ధం చేయడంతో పాటు మరో లక్ష మందికి భోజనాలు వండేందుకు ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాల కోసం ఆర్టీసీ 500 అదనపు ట్రిప్పులు నడుపుతుండగా, ఘాట్ రోడ్లపై శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. తిరుమలలో రద్దీ అధికమైతే తిరుపతిలోని ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లలో భక్తులను నిలిపివేసి వారికి ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా సుమారు 3,000 మంది పోలీసులు, 2,500 మంది విజిలెన్స్ సిబ్బందిని మోహరించారు. తిరుమలలో ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు మాడ వీధులు సహా 37 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవ ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మాడ వీధుల్లోని గ్యాలరీలకు వెళ్లి భక్తులతో మాట్లాడి అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. టీటీడీ కల్పిస్తున్న వసతులపై తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈవో ఆదేశించగా, భక్తులు ఓర్పు, సంయమనంతో వ్యవహరిస్తూ సిబ్బందికి సహకరించి స్వామివారి గరుడ సేవను విజయవంతం చేయాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.
