- ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత మార్పు
- బల్క్ వేస్ట్ జనరేటర్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి
- నెల రోజులపాటు విస్తృతంగా స్వచ్ఛత కార్యక్రమాలు
- జివిపిల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్‌లు
- విద్యార్థుల్లో స్వచ్ఛతపై అవగాహనకు ప్రత్యేక ప్రాధాన్యం
కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అధికార యంత్రాంగం వినూత్న ఆలోచనలతో పనిచేస్తోందని, స్వచ్ఛతలో శాశ్వత మార్పు తీసుకురావడానికి ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి, ఐఏయస్ పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛత హీ సేవ, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కెసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీవో సందీప్ కుమార్‌లతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన కలెక్టర్ అనంతరం అధికారులు, సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛతలో శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందని, మన నగరం, మన ఆరోగ్యం కోసం స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తరహాలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బల్క్ వేస్ట్ జనరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని, వారు వెంటనే వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల చివరకు ఆ వ్యర్థాలు ఎక్కడికి చేరుతున్నాయో ఆలోచించాలని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గార్గేయపురం డంప్‌యార్డులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధికార యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. మన ఊరు బాగుంటేనే మనకు మంచి పేరు వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా దశ నుంచే స్వచ్ఛత అలవాటుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రిబుల్ ఆర్ సెంటర్ల వినియోగం, వ్యర్థాల వేరు చేయడం, పునర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలో నెల రోజులపాటు వివిధ స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచడంతో పాటు ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. నగరంలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను దశలవారీగా తొలగించి పరిశుభ్రమైన ప్రాంతాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడటం, త్రిబుల్ ఆర్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వచ్ఛత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కమిషనర్ సూచించారు. పరిశుభ్రమైన నగరం కోసం ప్రజలు తమ ఇళ్ల నుంచే మార్పును ప్రారంభించి చెత్తను సరైన విధానంలో అందిస్తూ నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే కర్నూలు నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దగలమన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇన్స్పెక్టర్లు ఫరూక్, జిలాని, స్వచ్ఛ సర్వేక్షన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
