సింగరేణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు
మాదకద్రవ్యాల ముప్పును తరిమికొట్టాలని పిలుపు
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
అక్రమ విక్రయాలపై సమాచారం ఇవ్వాలని సూచన
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థుల సంకల్పం
కొత్త స్వరం, కారేపల్లి, సెప్టెంబర్ 22: యువత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, క్షణికానందం కోసం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమవుతాయని హెచ్చరించారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించాలని సూచించారు. సింగరేణి మండల ఎక్సైజ్ సీఐ పి. లింగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో లేదా పాఠశాలల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సింగరేణి మండల ఎక్సైజ్ సిబ్బంది వీరభద్రం, వసంతకుమారి, వాణి, సతీష్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు సంకల్పం చేశారు.

