వేంపేటలో విప్లవ అమరవీరుల వర్ధంతి సభ
చంద్ర పుల్లారెడ్డి స్థూపం వద్ద ఘనంగా నివాళులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడాలని పిలుపు
రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం
సమసమాజ స్థాపనే అమరవీరులకు నిజమైన నివాళి
పాములపాడు, నవంబర్ 8 (కొత్తస్వరం) : భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం సమసమాజ స్థాపన దిశగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ఎండీ రఫీ, పి. లాజరస్ పిలుపునిచ్చారు. పాములపాడు మండలం వేంపేట గ్రామంలోని చంద్ర పుల్లారెడ్డి స్థూపం వద్ద అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించి, స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ, నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల్లో వేలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని గుర్తుచేశారు. భారత విప్లవోద్యమంలో కామ్రేడ్స్ నీలం రామచంద్రయ్య, చండ్ర పుల్లారెడ్డి, చారు మజుందార్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు కామ్రేడ్ తిక్కన్న, గోకారి, ఉరుకుందప్ప, రామన్నగౌడ్ వంటి ఎందరో మహనీయులు అమరులయ్యారని పేర్కొన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చడం ద్వారా కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. భారత జీడీపీలో కీలక పాత్ర పోషించే వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు బూటకపు వ్యవసాయ ప్రణాళికలను తీసుకొస్తున్నారని, ఇవి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ చేపట్టారని, మావోయిస్టులు, అమాయక ఆదివాసీలపై బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఖండించాలని కోరారు. రాష్ట్రంలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో మరో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే భూములను లీజుకు ఇస్తూ వేల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తున్నారని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ భూములను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు చాంద్ బాషా, గాబ్రియేలు, పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. మర్రిస్వామి, వేంపేట గ్రామ నాయకులు దానమయ్య, అయ్యన్న, దేవమ్మ, శాంతమ్మ, రామకృష్ణ రాజు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు ఫారియా, రోజమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
