- హైదరాబాద్‌లో 18 శాతానికి తగ్గిన వర్షపాతం లోటు..
హైదరాబాద్, కొత్తస్వరం :
గత వారం రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో హైదరాబాద్ నగరానికి గణనీయమైన ఊరట లభించింది. వారం రోజుల క్రితం 34 శాతంగా ఉన్న వర్షపాతం లోటు ప్రస్తుతం 18 శాతానికి తగ్గినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ (టీజీడీపీఎస్) వెల్లడించింది. ప్రస్తుత రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు సాధారణంగా 297.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. అయితే నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. తిరుమలగిరిలో 45 శాతం, సైదాబాద్‌లో 35 శాతం, మారేడ్‌పల్లిలో 31 శాతం, అంబర్‌పేటలో 27 శాతం, నాంపల్లి, చార్మినార్ ప్రాంతాల్లో 26 శాతం చొప్పున వర్షపాతం లోటు నమోదైంది. మరోవైపు గోల్కొండలో సాధారణం కంటే 19 శాతం, బహదూర్‌పురాలో 5 శాతం అధిక వర్షపాతం నమోదైంది. షేక్‌పేట, అమీర్‌పేట, ముషీరాబాద్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో వర్షపాతం సాధారణ స్థాయికి చేరువలో ఉంది. ఇదిలా ఉండగా, రానున్న ఏడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టు 10 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణకు ఎల్లో అలర్ట్


