- మోదీ, గడ్కరీలకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు
- కొప్పర్తి–కడప బైపాస్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- పారిశ్రామిక సరుకు రవాణా మరింత సులభతరం
- రాయలసీమలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
- యువతకు ఉపాధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం
అమరావతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
కడప జిల్లాలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌ను కడప బైపాస్‌తో అనుసంధానించే నూతన రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.304.44 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారం అభినందనీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ)లో కొప్పర్తి కీలకమైన నోడ్‌గా ఉందని, కొత్త అనుసంధాన రహదారి అందుబాటులోకి వస్తే పారిశ్రామిక సరుకు రవాణా మరింత వేగవంతంగా, సులభతరంగా మారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా రాయలసీమ అభివృద్ధికి ఈ రహదారి దోహదపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
