- ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో పట్టాల పంపిణీ
- 28,445 కుటుంబాలకు ఇంటి స్థలాల హక్కు పత్రాలు
- పేదల ఇళ్ల కోసం 399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ
- రూ.8,874 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ
- లబ్ధిదారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వేలాది నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలను, ఆస్తి హక్కు పత్రాలను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని 28,445 కుటుంబాలకు సొంతింటి కల సాకారమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్ల స్థలాల కోసం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించగా, ఆయా స్థలాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.8,874 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో కార్యక్రమం జరిగిన ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. అంతకుముందు విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పట్టాల పంపిణీ అనంతరం చంద్రబాబు లబ్ధిదారులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ లబ్ధిదారులు, సభకు హాజరైన వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ సమస్యకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
