నంద్యాల, కొత్తస్వరం
మహిళల భద్రత, విద్యార్థుల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలపై నంద్యాల జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, శక్తి బృందం సభ్యులు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లు, షాపింగ్ మాల్స్, కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలతో పాటు జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం శక్తి బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గస్తీ కూడా నిర్వహించారు. విద్యార్థులకు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, శక్తి యాప్ వినియోగం, లోన్ యాప్ మోసాలు, ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన చట్టాలు, అపరిచిత లింకులు, వీడియో కాల్స్ వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి అధికారులు సమగ్రంగా వివరించారు. అదేవిధంగా బాల్య వివాహాల దుష్పరిణామాలు, మహిళల అక్రమ రవాణా, మహిళలపై నేరాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మంచి వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సత్ప్రవర్తన, మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించిన అధికారులు, సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అనుమానాస్పద సంఘటనలు, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-112ను సంప్రదించాలని సూచించారు. అలాగే శక్తి యాప్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, శక్తి బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


