26.8 C
Hyderabad
Homeక్రీడలు2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్

  • అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్
  • అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో భారత్-పాకిస్థాన్ పోరు
  • సరికొత్త ఫార్మాట్‌లో ‘సూపర్ 7’ దశ
  • నవంబర్ 17, 18న సెమీఫైనల్స్
  • నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్

హైదరాబాద్, అక్టోబర్ 1 (కొత్త స్వరం):
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సరికొత్త ఫార్మాట్‌లో జరగనుంది. 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు పునరావృతంగా అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొననున్నప్పటికీ గ్రూప్ స్టేజ్‌కు 12 జట్లు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత పొందగా, 2026 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి. దీంతో మొత్తం 10 జట్లు ఖరారవుతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫయర్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. క్వాలిఫయర్‌లో విజేత నేరుగా గ్రూప్ స్టేజ్‌కు చేరుకోగా, రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ‘సూపర్ సిరీస్’ నిర్వహిస్తారు. ఈ మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ మ్యాచ్‌ల అనంతరం అగ్రస్థానంలో నిలిచిన జట్టు 12వ జట్టుగా గ్రూప్ స్టేజ్‌కు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. గ్రూప్ స్టేజ్‌లో 12 జట్లను ఆరు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసేసరికి రెండు గ్రూపుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆరు జట్లు ‘సూపర్ 7’ దశకు అర్హత సాధిస్తాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టుకు ఏడో బెర్త్ దక్కుతుంది. పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్‌రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. సూపర్ 7 దశలో గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చిన ఏడు జట్లు పోటీపడతాయి. ఈ దశకు గ్రూప్ స్టేజ్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోరు, ప్రతి జట్టు సున్నా పాయింట్లతో ప్రారంభమవుతుంది. సూపర్ 7లో ప్రతి జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అభిమానులు, ప్రసారదారుల సౌలభ్యం కోసం ఐసీసీ ‘ప్రీ-సీడింగ్’ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో కొన్ని అగ్ర జట్లకు ముందుగానే సీడింగ్ కేటాయించారు. ఉదాహరణకు భారత్‌కు A1, ఆస్ట్రేలియాకు A2, పాకిస్థాన్‌కు A3గా సీడింగ్ ఇచ్చారు. ఈ జట్లు సూపర్ 7కు అర్హత సాధిస్తే వాటి సీడింగ్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. సీడెడ్ జట్టు అర్హత సాధించకపోతే దాని స్థానంలో అర్హత సాధించిన జట్టుకు అదే సీడింగ్ వర్తిస్తుంది. దీంతో షెడ్యూల్‌లో మార్పులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సూపర్ 7 దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. తొలి స్థానంలోని జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో ఒక సెమీఫైనల్‌లో, రెండు, మూడు స్థానాల్లోని జట్లు మరో సెమీఫైనల్‌లో తలపడతాయి. సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన రెండు జట్లు నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఫైనల్‌లో తలపడతాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 17న కేప్‌టౌన్‌లో, రెండో సెమీఫైనల్ నవంబర్ 18న ష్వానేలో జరగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డేలను కూడా కేటాయించారు. గ్రూప్ దశలో అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో భారత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుండగా, అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. అక్టోబర్ 14న ష్వానేలో ఆఫ్ఘనిస్థాన్‌తో, అక్టోబర్ 17న బ్లూమ్‌ఫోంటెన్‌లో క్వాలిఫయర్ ఏ జట్టుతో, అక్టోబర్ 24న విక్టోరియా ఫాల్స్‌లో జింబాబ్వేతో భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. సూపర్ 7 దశలో సీడెడ్ జట్ల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న విక్టోరియా ఫాల్స్‌లో ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 31న జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో, నవంబర్ 4న పార్ల్‌లో న్యూజిలాండ్‌తో, నవంబర్ 7న కేప్‌టౌన్‌లో పాకిస్థాన్‌తో, నవంబర్ 11న గెబెర్హాలో ఇంగ్లండ్‌తో, నవంబర్ 14న డర్బన్‌లో శ్రీలంకతో భారత్ తలపడేలా షెడ్యూల్ రూపొందించారు. క్వాలిఫయర్‌కు సంబంధించిన సూపర్ సిరీస్ మ్యాచ్‌లు అక్టోబర్ 2, 4, 6 తేదీల్లో విండ్‌హోక్‌లో జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. సూపర్ 7 దశ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. అనంతరం నవంబర్ 17న కేప్‌టౌన్‌లో తొలి సెమీఫైనల్, నవంబర్ 18న ష్వానేలో రెండో సెమీఫైనల్, నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ, షెడ్యూల్ విడుదలతో పాటు టికెట్ల కేటాయింపు ప్రారంభం కావడం టోర్నమెంట్ సన్నాహాల్లో కీలక మైలురాయిగా పేర్కొన్నారు. మూడు దేశాలు క్రికెట్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.