అటవీ అమరవీరుల దినోత్సవంలో ఘన నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
నవీన్ సతీమణి ప్రమీలకు పరిహారం చెక్కు అందజేత
అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో నవీన్ త్యాగం చిరస్మరణీయం
అమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండ
కారేపల్లి, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.30 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. హైదరాబాద్లో నిర్వహించిన అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు నవీన్ సేవలను స్మరించుకుని ఘన నివాళులర్పించారు. అనంతరం నవీన్ సతీమణి ప్రమీలకు రూ.30 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన నవీన్ త్యాగం చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ అమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
