- కియా సోనెట్‌లో పదేపదే డీపీఎఫ్ సమస్య
- యజమానికి అండగా నిలిచిన కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్
- రూ.10.99 లక్షలు వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం
- వారంటీలో సమస్య పరిష్కరించకపోవడం సేవాలోపమేనని తీర్పు
- కియా ఇండియా, డీలర్ సంయుక్తంగా మొత్తం చెల్లించాలని స్పష్టీకరణ
కర్నూలు, అక్టోబర్ 1 (కొత్త స్వరం) :
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియాకు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము విక్రయించిన కియా సోనెట్ డీజిల్ కారులో ఉన్న సాంకేతిక లోపాన్ని పదేపదే సరిచేయడంలో విఫలమైనందుకు, కారు ఎక్స్‌షోరూమ్ ధరను వడ్డీతో సహా యజమానికి వాపసు ఇవ్వాలని ఆదేశిస్తూ కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు వెలువరించింది. వారంటీ వ్యవధిలో ఉన్నప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోవడం సేవలో లోపం కిందకే వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ 2022 మార్చిలో కియా సోనెట్ హెచ్‌టీఎక్స్ (బీఎస్6 డీజిల్) కారును కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన సుమారు రూ.13.69 లక్షలు ఆన్‌రోడ్ ధర చెల్లించారు. కొన్నికాలానికే కారులోని డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (డీపీఎఫ్) పదేపదే సమస్యకు గురైంది. దీంతో ఆయన అనేకసార్లు సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు. సర్వీస్ రికార్డుల ప్రకారం రీజనరేషన్, సెన్సార్ మార్పిడి, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ వంటి పలు మరమ్మతులు చేసినప్పటికీ సమస్య పునరావృతమవుతూనే ఉంది. అనేక అవకాశాలు ఇచ్చినా కంపెనీ, డీలర్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోవడంతో యజమాని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్, వారంటీ సమయంలో ఒకే సమస్య పదేపదే తలెత్తడం, దాన్ని కంపెనీ పరిష్కరించలేకపోవడం సేవలో లోపమేనని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో కియా ఇండియా, స్థానిక డీలర్ అయిన ఎంజీ బ్రదర్స్ కియా సంయుక్తంగా బాధ్యత వహించాలని ఆదేశించింది. కారు ఎక్స్‌షోరూమ్ ధర అయిన రూ.10,99,890ను ఫిర్యాదు చేసిన తేదీ ఫిబ్రవరి 25, 2026 నుంచి 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి యజమానికి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం చెల్లించిన తర్వాత యజమాని కారును కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. దీనితో పాటు వినియోగదారునికి కలిగిన మానసిక వేదన, న్యాయపరమైన ఖర్చుల కింద అదనపు పరిహారం కూడా చెల్లించాలని కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పు వారంటీ సమయంలో వాహనాల్లో తలెత్తే లోపాలపై వినియోగదారుల హక్కులకు సంబంధించిన అంశాన్ని మరోసారి ప్రస్తావించింది.
