19.9 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్ముస్లింలకు జడ్పీ చైర్మన్ పదవి కేటాయించాలి

ముస్లింలకు జడ్పీ చైర్మన్ పదవి కేటాయించాలి

  • డాక్టర్ షేక్ సాధికకు అవకాశం ఇవ్వాలని ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్
  • దేవనకొండ జడ్పీటీసీగా 3,585 ఓట్ల మెజారిటీతో విజయం
  • జిల్లా పరిషత్‌ ఏర్పాటైనప్పటి నుంచి ముస్లింలకు దక్కని అవకాశం
  • పార్టీ కోసం పనిచేసిన మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పించాలి
  • చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని విజ్ఞప్తి

కర్నూలు, నవంబర్ 12 (కొత్త స్వరం):
కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బొందిమడుగుల మహబూబ్‌ భాష తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని డిమాండ్‌ చేశారు. 1959లో కర్నూలు జిల్లా పరిషత్‌ ఏర్పాటైనప్పటి నుంచి తొలి చైర్మన్‌గా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పనిచేశారని, ఇప్పటివరకు 15 మంది వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు చైర్మన్లుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా ఈ అవకాశం దక్కలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవనకొండ జడ్పీటీసీ సభ్యురాలిగా టీడీపీ కూటమి తరఫున 3,585 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ షేక్ సాధికా ఎంబీబీఎస్‌కు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కేటాయించాలని కోరారు. ఆమె తాత హుస్సేన్‌ ఆలం 30 ఏళ్లపాటు ప్యాలకుర్తి సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేశారని, ఆమె మామ దేవరబండ సుభాన్‌ కూడా మూడు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వారి సేవలను గుర్తించి సముచిత న్యాయం చేయాలని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న నారా లోకేశ్‌ పిలుపుతో వైద్య సేవలతో పాటు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో 24 ఏళ్ల జెన్‌-జీ యువ వైద్యురాలు డాక్టర్ షేక్ సాధిక రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కల్పించాలని మహబూబ్‌ భాష డిమాండ్‌ చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ముస్లిం నాయకులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్‌, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరారు. జిల్లాలో మైనారిటీలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నప్పటికీ వారిని కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని, రాజకీయంగా ఎదిగేందుకు తగిన అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు పార్టీకి మరింత ఆదరణ పెరిగేలా కర్నూలు జడ్పీ చైర్మన్‌ పదవిని ముస్లింలకు కేటాయించాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని ముస్లిం హక్కుల పోరాట సమితి తరఫున మహబూబ్‌ భాష డిమాండ్‌ చేశారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.