- సుగాలి ప్రీతికి నివాళులర్పిస్తే అడ్డుకుంటారా?
- తల్లి పార్వతి పోరాటానికి అండగా నిలవాలి
- అధికార బలంతో ఉద్యమాలను ఆపలేరు
- ప్రభుత్వ వైఖరిపై మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్ ప్రశ్నలు
- న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం

కర్నూలు, ఆగస్టు 19 (కొత్త స్వరం):
తొమ్మిదేళ్ల క్రితం దారుణ ఘటనకు బలైన గిరిజన బాలిక సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లి పార్వతి బుధవారం చేపట్టిన వీల్‌చైర్ యాత్రకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. కర్నూలులో సుగాలి ప్రీతి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పార్వతి చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సుగాలి ప్రీతికి నివాళులర్పించేందుకు వచ్చిన తమను, బాధిత తల్లి చేపట్టిన వీల్‌చైర్ యాత్రను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అధికార బలంతో ప్రజల గొంతును నొక్కలేరని, న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. బాధితుల తరఫున ప్రశ్నించే ప్రతి గొంతుకకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. సుగాలి ప్రీతి ఘటనపై గతంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఈ కేసుపై కనీసం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. నిందితులపై ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అప్పట్లోనూ, ఇప్పుడూ టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయగలిగే స్థితిలో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంతవరకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందనే భావన ప్రజల్లో ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి హంతకులకు శిక్ష పడే వరకు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని విజయ్‌కుమార్ తేల్చిచెప్పారు.
