640.58 అడుగులకు చేరిన రిజర్వాయర్ నీటిమట్టం
1,150 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు
గేట్లు తెరిచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట జిల్లాలో 20 గ్రామాలకు హెచ్చరిక
నల్గొండ జిల్లాలో 21 గ్రామాలకు అప్రమత్తత సూచన
కొత్త స్వరం, సూర్యాపేట: ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోందని నీటిపారుదల శాఖ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి గాను రిజర్వాయర్‌లో ప్రస్తుతం 640.58 అడుగుల నీటిమట్టం, 4.46 టీఎంసీలకు గాను 3.35 టీఎంసీల నిల్వ ఉంది. గత 24 గంటల్లో 1,150 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదుకాగా, రానున్న రోజుల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరమైన సమయంలో రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున సంబంధిత గ్రామాల ప్రజలు నదిలోకి, నది పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. సూర్యాపేట, పెన్‌పహాడ్, పాలకీడు మండలాల్లోని రత్నాపురం, రామవరం, హనుమాన్ తండా, వెంకట్రాంపూర్ టేకుమట్ల, నంద్యాలగూడెం, కొంకతిమ్మని అన్నారం తదితర 20 గ్రామాలు, నల్గొండ జిల్లాలో కేతేపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాల్లోని బొప్పారం, కాసనాగోడ్, చికటిగూడెం, కొత్తపేట, ఉప్పలపహాడ్ తదితర 21 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని నీటిపారుదల శాఖ నం.1 సూర్యాపేట కార్యనిర్వహణ అధికారి కోరారు.
