ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆయుర్వేదం దోహదం: డాక్టర్ డి. సావిత్రి
అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరం
పాములపాడు, సెప్టెంబర్ 23 (కొత్తస్వరం): పాములపాడు మండలంలోని మిట్టకందల గ్రామంలో అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుష్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. సావిత్రి మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యాధుల నివారణలో ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం ప్రధాన ఉద్దేశం ‘వన్ హెల్త్.. వన్ ఫ్యూచర్’ అనే భావనతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలన్నదేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మిట్టకందల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది ఎం. రవి, టీడీపీ మండల కల్చరల్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
