31 C
Hyderabad
Homeతాజా వార్తలువినాయక ఘాట్‌ రూపాంతరంపై లోకేష్ ప్రశంసలు

వినాయక ఘాట్‌ రూపాంతరంపై లోకేష్ ప్రశంసలు

  • పరిశుభ్రంగా మారిన వినాయక ఘాట్‌పై అభినందనలు
  • మంత్రి టీజీ భరత్, కలెక్టర్, కమిషనర్‌కు ప్రశంసలు
  • అధికార యంత్రాంగం కృషిని కొనియాడిన లోకేష్
  • నాలుగు నెలల్లో ఘాట్‌కు కొత్త రూపు
  • ప్రజా ప్రదేశాల పరిశుభ్రతను కాపాడాలని పిలుపు

కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
కర్నూలు నగరంలోని వినాయక ఘాట్‌ అభివృద్ధి, రూపాంతరంపై రాష్ట్ర సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి (విద్య), రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. వినాయక ఘాట్‌ వద్ద గత నాలుగు నెలలుగా చేపట్టిన పారిశుద్ధ్య, అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోను కర్నూలు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా రూపొందించి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా, శనివారం మంత్రి నారా లోకేష్ ఆ వీడియోను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వేదికల్లో రీ-అప్‌లోడ్ చేసి మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు అధికార యంత్రాంగాన్ని అభినందించారు. చెత్తతో నిండిపోయిన ప్రాంతం పరిశుభ్రమైన, అందమైన, అభివృద్ధి చెందిన వినాయక ఘాట్‌గా మారడం అభినందనీయమని పేర్కొన్న మంత్రి, కేంద్రీకృత పాలనతో పాటు ప్రాథమిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఎలాంటి మార్పు సాధ్యమవుతుందో కర్నూలు వినాయక ఘాట్‌ రూపాంతరం చాటిచెబుతోందన్నారు. ఈ మార్పు కోసం కృషి చేసిన మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు మొత్తం అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకత్వం స్థానిక పరిపాలనా యంత్రాంగంతో కలిసి పనిచేస్తే అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయని పేర్కొంటూ, పరిశుభ్రంగా మారిన ప్రజా ప్రదేశాలను ఇకపై కూడా అదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, అందమైన మార్పును కొనసాగించడంలో ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. నాలుగు నెలల క్రితం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన చల్లా ఓబులేసు తొలుత జేసీబీలతో పెద్ద ఎత్తున చెత్తాచెదారాన్ని తొలగింపజేయడంతో పాటు ఘాట్‌ వద్ద సీసీ రహదారి, మెట్లు, బండ్, డ్రెయిన్, రాతి నిర్మాణాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. కేసీ కెనాల్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగింపజేసి, ఘాట్‌ పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. కెనాల్‌లో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు చెత్త సేకరణ ట్రాలీలను అందుబాటులో ఉంచారు. దీంతో గతంలో చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రాంతం ప్రస్తుతం పరిశుభ్రంగా, సుందరంగా రూపాంతరం చెందింది. ఈ మార్పులకు సంబంధించిన ప్రత్యేక వీడియోను కర్నూలు నగరపాలక సంస్థ రూపొందించి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా, శనివారం మంత్రి నారా లోకేష్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో దానిని రీ-అప్‌లోడ్ చేసి అభినందించడం విశేషంగా నిలిచింది.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.