అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు
దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతల పరిశీలన
పత్రాలు సమర్పించి అధికారులకు సహకరించాలి
పారదర్శకంగా పరిశీలన చేపడుతున్న అధికారులు
ప్రభుత్వ పథకం అర్హులకు అందేలా చర్యలు
కొత్త స్వరం, కారేపల్లి, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయూత పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని మంగళవారం భాగ్యనగర్ తండాలో నిర్వహించారు. ప్రత్యేక అధికారి, మండల నీటిపారుదల శాఖ ఏఈఈ ఎడిండ్ల నాగయ్య దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి అర్హతలను పరిశీలించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత నెలలో పింఛన్ కోసం దరఖాస్తులు స్వీకరించామని, ప్రస్తుతం వాటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పరిశీలనకు వచ్చే అధికారులు అడిగే అర్హత పత్రాలు, ఇతర అవసరమైన వివరాలను అందించి వారికి సహకరించాలని దరఖాస్తుదారులను కోరారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం అందేలా అధికారులు పారదర్శకంగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పెండ్రా అనిల్ కుమార్, వార్డు సభ్యులు వాంకుడోత్ గాంధీ, పంచాయతీ సిబ్బంది హేంచంద్, రాందాస్, ఇరిగేషన్ సిబ్బంది వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు గుగులోత్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
