ఈగల్ ఫోర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జాతీయ స్థాయి అవార్డుతో తెలంగాణకు గర్వకారణం
డ్రగ్స్ నియంత్రణ ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలి
2029 నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం
కొత్త స్వరం, హైదరాబాద్, సెప్టెంబర్ 23: మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) 3వ జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డు అందుకోవడం రాష్ట్ర పోలీసు శాఖకు, తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న సమర్థవంతమైన విధానాలకు ఈ జాతీయ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి కుటుంబం, పాఠశాల, సంస్థ, పౌరుడి సమిష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ వారిని మాదకద్రవ్యాల ప్రభావం నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ డ్రగ్స్ విక్రయం, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. “‘నషా ముక్త భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడాలి. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలి” అని సీఎం ఆకాంక్షించారు. మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తూ యువతలో చైతన్యం కల్పించడం, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
