- తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
- ప్రజా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు
- ఆదివాసుల భూములకు రక్షణ కల్పించాలి
- హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- హక్కుల సాధనకు ఐక్య పోరాటం అవసరం
హైదరాబాద్, అక్టోబర్ 9 (కొత్త స్వరం) : తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుందరయ్య పార్కు సమీపంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, భౌగోళిక తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ప్రజా సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికీ సీమాంధ్ర పెట్టుబడిదారుల పాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికలపై తాను చంద్రబాబు శిష్యుడినని ప్రకటిస్తూ ఆయన ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని, 22ఏ నిబంధనను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆదివాసులకు 1/70 చట్టాన్ని అమలు చేయకుండా వారి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయలేదని, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మార్పు వస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ పార్టీ నాయకులు స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ప్రజలందరూ సంఘటితమై పోరాటాలను కొనసాగించాలని, పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని రాంబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బి. ముత్తయ్య జెండాను ఆవిష్కరించగా, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పల సోమయ్య, గుండపురి ఎల్లయ్య, శ్రీహరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
