25.4 C
Hyderabad
Homeతాజా వార్తలుబాధితుల మనసును చదివితేనే అసలు నిజం!

బాధితుల మనసును చదివితేనే అసలు నిజం!

  • లైంగిక వేధింపుల బాధితులను నిందించొద్దు
  • రోగి మానసిక స్థితిని బట్టి చికిత్స
  • పిల్లలకు భరోసా ఇవ్వాలి.. భయాన్ని తొలగించాలి
  • సంఘమిత్ర క్లినిక్ వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 16 (కొత్తస్వరం) :
బాల్యం, కౌమార దశలో ఎదురయ్యే లైంగిక వేధింపులు బాధితుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంఘమిత్ర క్లినిక్‌లో నరాల, మానసిక, లైంగిక సమస్యలకు వైద్య నిపుణులుగా సేవలందిస్తున్న డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా 15 నుంచి 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్న సందర్భాల్లో వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని వ్యవహరించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాధితులు తమకు జరిగిన విషయాలను వెంటనే తల్లిదండ్రులకు చెప్పలేకపోవడానికి భయం, ఆందోళన, ఇతర మానసిక కారణాలు ఉండవచ్చని వివరించారు. కొందరు యువతులు పలువురి నుంచి లైంగిక వేధింపులకు గురైనప్పటికీ, ఆ విషయాలను బయటపెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

నిందించడం కాదు.. నమ్మకం కల్పించాలి..
లైంగిక వేధింపులకు గురైన బాధితులు తమకు జరిగిన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించినప్పుడు, ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం వల్ల వారు మరింత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని డాక్టర్ హరిప్రసాద్ పేర్కొన్నారు.. తల్లిదండ్రులు పిల్లలను నిలదీయడం కంటే వారి పరిస్థితిని అర్థం చేసుకొని భరోసా ఇవ్వాలని సూచించారు. వైద్యులు సైతం రోగి మానసిక స్థితిని బట్టి సున్నితంగా వ్యవహరిస్తూ, నమ్మకం కల్పించి సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..
బాధితులను నిందించకుండా, వారి మాటలను శ్రద్ధగా వినడం, అవసరమైన వైద్య సహాయం అందించడం కీలకమని తెలిపారు. పిల్లలు తమకు ఎదురైన ఇబ్బందులను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలని సూచించారు. మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని తగిన సమయంలో నిపుణుల సహాయం అందించడం ద్వారా బాధితులకు అండగా నిలవవచ్చని డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ వివరించారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.