
రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
ప్రధాన రహదారులపై సరుకు రవాణా వాహనాల తనిఖీలు
‘ఆగండి – ముఖం కడుక్కోండి – వెళ్లండి’ కార్యక్రమంతో అవగాహన
మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు: ఎస్పీ
నంద్యాల, నవంబర్ 22 (కొత్త స్వరం): నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిరంతరం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతిరోజూ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో రాత్రి వేళల్లో అనవసరంగా సంచరించే వ్యక్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారులతో పాటు ఇతర ప్రధాన రహదారులపై రాత్రి వేళల్లో సరుకు రవాణా చేసే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనదారులు అలసట కారణంగా ప్రమాదాలకు గురికాకుండా ‘ఆగండి – ముఖం కడుక్కోండి – వెళ్లండి’ కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన చోట విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, ఆకతాయిలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలను నియంత్రించేందుకు నేర నియంత్రణ ప్రత్యేక బృందాల సహకారంతో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నంద్యాల జిల్లా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని, నేరాల నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
