నంద్యాల పార్లమెంట్ పరిధిలో రహదారి సమస్యలపై వినతి
అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, బస్‌షెల్టర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (కొత్త స్వరం): కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బుధవారం నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ప్రజల భద్రత, సౌకర్యం, మెరుగైన రవాణా కనెక్టివిటీకి సంబంధించిన పలు సమస్యలను వినతిపత్రం ద్వారా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బొల్లవరం, కరివేన, ఆత్మకూరు–సిద్ధపల్లె జంక్షన్ వద్ద అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని, పారుమంచాల వద్ద మీడియన్ ఓపెనింగ్, డీపాల్ స్కూల్ సమీపంలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, భానుముక్కల–ఇస్కాల గ్రామాల్లో బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీని కోరినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. అలాగే ఎన్‌హెచ్-340సీ (ఆత్మకూరు–దోర్నాల), ఎన్‌హెచ్-544డీ (బుగ్గ–కైప–గిద్దలూరు) రహదారులకు సంబంధించిన డీపీఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినట్లు ఆమె వివరించారు.
