రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఆందోళన
తిరుమల జలాశయాలు ఎండిపోతున్నాయని వెల్లడి
వెంటనే వరుణయాగం చేపట్టాలని డిమాండ్
వైసీపీ హయాంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేత
సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచన
తిరుపతి, ఆగస్టు 12 (కొత్తస్వరం): రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వెంటనే వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో లోకకల్యాణం, ప్రజా శ్రేయస్సు కోసం టీటీడీ ఆధ్వర్యంలో పలు వైదిక కార్యక్రమాలు, హోమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీటీడీ పాలకులు వేద, వైదిక సంప్రదాయాలు, శతాబ్దాల ఆచారాలను పక్కనపెడుతున్నారని ఆరోపించారు. కేవలం వీఐపీ సేవలకే ప్రాధాన్యం ఇస్తూ ధార్మిక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రజాక్షేమం కోసం వెంటనే వరుణయాగం చేపట్టాలని భూమన కోరారు.
