27.8 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్జాతీయ భావనతో కర్నూలులో సైకిల్ ర్యాలీ

జాతీయ భావనతో కర్నూలులో సైకిల్ ర్యాలీ

– యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం

– ఆగస్టు 13, 14, 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం

– ప్రతి పౌరుడు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు

– “నేను నా దేశానికి ఎలా సేవ చేయగలను?” అనే సందేశాన్ని పంచుకోవాలి

– సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత, విద్యార్థులు, క్రీడాకారులు

కర్నూలు, ఆగస్టు 12 (కొత్త స్వరం): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం, బాధ్యతాయుత పౌరసత్వంపై అవగాహన కల్పించే లక్ష్యంతో యూత్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, సెట్కూరు, కర్నూలు ఆధ్వర్యంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ. సిరి ఆదేశాల మేరకు సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, జిల్లా క్రీడల అధికారి భూపతి రావు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి శ్రీ కార్తికేయ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సైకిల్ ర్యాలీలో యువత, క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ పతాకాలను చేతబూని సైకిళ్లపై ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యత, ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ప్రతి ఇంటా త్రివర్ణం

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి పౌరుడు తమ ఇళ్లపై, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థల వద్ద జాతీయ పతాకాన్ని గౌరవంగా ప్రదర్శించి దేశం పట్ల తమ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

“ప్రతి ఇంటా త్రివర్ణం – ప్రతి హృదయంలో దేశభక్తి” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

మొక్క నాటి.. దేశ భవిష్యత్తును కాపాడుదాం

ఆగస్టు 14న ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని అధికారులు సూచించారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

దేశానికి నేను ఎలా సేవ చేయగలను?

ప్రతి పౌరుడు “నేను నా దేశానికి ఎలా సేవ చేయగలను?” అనే అంశంపై చిన్న వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

దేశ సేవ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, రక్తదానం, విద్య, క్రీడలు, ఆరోగ్యం, ట్రాఫిక్ నియమాల పాటింపు, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం, ఇతరులకు సహాయం చేయడం, సమాజ అభివృద్ధి వంటి అంశాలపై తమ సందేశాలను వీడియో రూపంలో పంచుకోవచ్చని తెలిపారు.

సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసే సమయంలో సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులు కోరారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.