- ఎడిటర్ రవిరాజుకు అభినందనలు
- ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని ఆకాంక్ష
- ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
- మాల మహానాడు నాయకులు, కార్యకర్తల హాజరు

కొత్తస్వరం, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు కేడం సుబ్బరాయుడు చేతుల మీదుగా కొత్తస్వరం దినపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేడం సుబ్బరాయుడు కొత్తస్వరం దినపత్రికను ఆవిష్కరించి, ఎడిటర్ రవిరాజుకు అభినందనలు తెలిపారు. నూతనంగా ప్రారంభమైన దినపత్రిక ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, సమాజంలోని వివిధ వర్గాల సమస్యలు, అవసరాలు, ఆశయాలను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడం ద్వారా ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలక పాత్ర పోషించగలవని కేడం సుబ్బరాయుడు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా సమాచారాన్ని అందించడంలోనూ దినపత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని కొత్తస్వరం తన ప్రస్థానాన్ని కొనసాగించాలని, ప్రజల నమ్మకాన్ని సంపాదిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎడిటర్ రవిరాజుకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, పత్రిక భవిష్యత్తులో మరింత విస్తరించి ప్రజల గొంతుకగా నిలవాలని అభిలషించారు. కొత్తస్వరం దినపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు హాజరై పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
