- 140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు
- జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన
- త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి
- హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు జీవకోటికి జీవనాడిగా ఉన్న కృష్ణమ్మ ఒడిలో తమ జీవనాధారాన్ని కోల్పోయి 140 రోజులుగా దీక్షా శిబిరంలో ఆవేదనతో కాలం గడుపుతున్నామని బాధితుడు జయన్న కన్నీటి పర్యంతమయ్యారు. పిడికెడు మెతుకులు పెట్టి తమ కుటుంబాలకు జీవనం కల్పించాలని ఆయన వేడుకున్నారు. 40 ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని జీవనం సాగిస్తున్న తమ బతుకులను కాపాడేందుకు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించాలని కోరారు. జీవో 98 ఉత్తర్వుల ప్రకారం తమకు ఉద్యోగాలు కల్పించి తమ కుటుంబాల ప్రాణాలను నిలబెట్టాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడ్డారు. ఇప్పటికే జీవనాధారం లేక 32 మంది మృతి చెందారని, మిగిలిన బాధిత కుటుంబాలనైనా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎవరూ చేయని త్యాగాన్ని తాము చేశామని, తమ త్యాగాలను పాలకులు గుర్తించాలని జయన్న అన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే తమకు హామీలు ఇచ్చిన చోటే కుటుంబాలతో సహా మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీక్షలో నాగేంద్రుడు, జంభన్న, నారాయణ, నాగసుం కన్న, నాగరాజు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రాజారావు, జయన్న తదితరులు పాల్గొన్నారు.
