- పంటలు దెబ్బతినడంతో కూలీలకు పనుల కొరత
- పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
- గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి
- డ్రైనేజీలను ప్రతినెలా శుభ్రం చేయాలి
- వీధిలైట్ల సమస్య పరిష్కరించకుంటే ఆందోళన
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం నందికొట్కూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అధికారి అమరేంద్రుడు, ఏపీవోలకు సీపీఎం నాయకులు ఎం. నాగేశ్వరరావు, టి. గోపాలకృష్ణ, కొంగర వెంకటేశ్వర్లు, ఎస్. ఉస్మాన్ భాష, బేస్తరాజు, ఎం. కర్ణ, పి. పకీర్ సార్ తదితరులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న, మినుము, సోయాబీన్, పత్తి తదితర పంటలు దెబ్బతినడంతో గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి జాబ్ కార్డుకు 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలని, గతంలో పనిచేసిన 5 నుంచి 8 వారాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొణిదల, వడ్డమాను, బిజినవేముల గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నప్పటికీ డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆయా గ్రామాల్లో వెంటనే డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. నాగటూరు, కోనేటమ్మపల్లె గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు ఉన్నప్పటికీ ఏడాదికి ఒక్కసారి కూడా శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, ప్రజలు అంటురోగాల బారినపడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ కాలువలను ప్రతినెలా శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో అధికారులు, సచివాలయ సిబ్బంది వెంటనే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి, వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని నాగేశ్వరరావు కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
